Gautam Gambhir: తమ వయసెంతో కూడా తెలియని వాళ్లకు నా రికార్డులు ఎలా గుర్తుంటాయి?: అఫ్రిదీకి గంభీర్ చురక
- గంభీర్, అఫ్రిదీ మధ్య కొనసాగుతున్న మాటలయుద్ధం
- తన జీవిత కథలో గంభీర్ పై వ్యాఖ్యలు చేసిన అఫ్రిది
- ట్విట్టర్ ద్వారా ఘాటుగా బదులిచ్చిన గంభీర్
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీల మధ్య మాటల యుద్ధం ఇప్పటిదికాదు. వారిద్దరూ తమ జాతీయ జట్లకు ఆడుతున్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి పడనట్టుగా వ్యవహరించేవారు. మైదానంలో అనేక పర్యాయాలు ఇరువరి మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆట నుంచి తప్పుకున్నాక కూడా ఇద్దరూ వాడీవేడి వ్యాఖ్యలతో విమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా అఫ్రిదీ తన జీవితకథ 'ది గేమ్ చేంజర్'లో గంభీర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
"గంభీర్ కంటూ ప్రత్యేక వ్యక్తిత్వంలేదు. ఆటలో ఒకడు... అంతకుమించి చెప్పడానికేం లేదు. అతనికి పెద్ద రికార్డులు కూడా ఏమీ లేవు. కానీ తనను తాను డాన్ బ్రాడ్ మన్, జేమ్స్ బాండ్ కలగలిసిన వాడ్నని ఊహించుకుంటాడు. ఆదే విధంగా ప్రవర్తిస్తుంటాడు" అంటూ కామెంట్ చేశాడు. దీనిపై గంభీర్ ఘాటుగా బదులిచ్చాడు.
"తమ వయసెంతో కూడా తెలియనివాళ్లకు నా రికార్డులు ఎలా గుర్తుంటాయి! ఓకే షాహిద్ అఫ్రిదీ, నీకో విషయం గుర్తుచేస్తాను.... 2007లో జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, పాక్ జట్లు ఆడాయి. ఆ మ్యాచ్ లో నేను 54 బంతుల్లోనే 75 పరుగులు చేశాను. నువ్వు ఒక్క బాల్ ఆడి సున్నాకే అవుటయ్యావు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆ కప్ మేమే గెలిచాం. ఇక నా వ్యక్తిత్వం అంటావా... నేను పొగరుబోతునే. అయితే నా పొగరు అబద్ధాలకోరులపైనా, నమ్మకద్రోహులపైనా, అవకాశవాదులపైనే చూపించేవాడ్ని" అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.
కాగా, అఫ్రిది వయసుకు సంబంధించిన వివాదాన్ని గంభీర్ తన ట్వీట్ లో ప్రస్తావించి చురక అంటించాడు. క్రికెట్ కెరీర్ తొలినాళ్లలో అండర్-14 ట్రయల్స్ కు వెళ్లగా, వయసెంతని కోచ్ అడిగితే నోటికి వచ్చిన వయసు చెప్పానని అఫ్రిదీ వెల్లడించడం వివాదం రేకెత్తించింది. దాంతో అఫ్రిది మోసకారి అంటూ అనేకమంది విమర్శించారు.