Viral Videos: ఆహారం కోసం గుంపులు గుంపులుగా ఎగబడ్డ ప్రజలు.. వీడియో ఇదిగో
- కర్ణాటకలో ఘటన
- ఆహారం కిట్లు అందించిన ఎమ్మెల్యే
- సామాజిక దూరం నిబంధనలు బేఖాతరు
కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో పేదలకు ఆహారం దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని బరేలీలో ఉచిత ఆహార కిట్లను అందించారు. సామాజిక దూరం నిబంధనను విస్మరించి పెద్ద ఎత్తున గుంపులు గుంపులుగా వాటిని తీసుకోవడానికి ప్రజలు ఎగబడ్డారు.
ఈ ఫుడ్ ప్యాకెట్లను విజయనగర్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ప్రజలకు అందించారు. ఆకలితో అలమటిస్తోన్న ప్రజలు ఒక్కసారిగా వాటి కోసం ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు దొరికింది. ఆహార ప్యాకెట్ల కోసం పెద్ద ఎత్తున ప్రజలు సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఆహార పొట్లాల కోసం అందరూ ఒక్కసారిగా ఎగబడడంతో కొందరు మహిళలు కిందపడిపోయారు. కాగా, మే 3వరకు లాక్డౌన్ కొనసాగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పని లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలు మరిన్ని కష్టాలు చవి చూడాల్సి వస్తోంది. కర్ణాటకతో పాటు చాలా రాష్ట్రాలు వలస కార్మికులకు, పేదలకు ఆహారాన్ని అందిస్తున్నాయి.