Lockdown: లాక్‌డౌన్ మినహాయింపుల్లో రాష్ట్రాల తీరు సరికాదు: కేంద్ర హోంశాఖ అసంతృప్తి!
- కేంద్రం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి
- ఇది దేశవ్యాప్త విపత్తు అన్న విషయం గుర్తుంచుకోవాలి
- రెస్టారెంట్లు, బస్సు సర్వీసులకు కేరళ అనుమతిని తప్పుపట్టిన శాఖ కార్యదర్శి
కరోనా దేశవ్యాప్త విపత్తు అని, ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ నిబంధనలపై కేంద్ర మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఆయా రాష్ట్రాలు ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదని కేంద్రహోం శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిష్టపరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈనెల 15న కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను ప్రతి ఒక్క రాష్ట్రం తప్పక పాటించాలని సూచించింది. కేరళలో ఈరోజు నుంచి రెస్టారెంట్లు తెరుచుకునేందుకు, బస్సులు తిరిగేందుకు అనుమతి ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడాన్ని కేంద్రం తప్పుపట్టింది. అత్యవసరం కాని సేవలను అనుమతించడాన్ని తప్పుపడుతూ ఆ రాష్ట్ర సీఎస్‌కు ప్రత్యేక లేఖ కూడా రాసింది.
అదే సమయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా అన్ని రాష్ట్రాల కార్యదర్శులకు లేఖ రాస్తూ కేంద్ర మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ‘దేశం విపత్తు ఎదుర్కొంటున్న సమయం ఇది. ఎవరికి వారు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే దేశమంతా నష్టపోయే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాకూడదు. సొంత నిర్ణయాలు తీసుకునే వారు వెంటనే దిద్దుబాటుచర్యలు తీసుకోండి’ అంటూ కార్యదర్శి ఆ లేఖల్లో కోరారు.