Assam: టక్కుటమారి కరోనా.. అసోంలో పాజిటివ్‌గా తేలిన 82 శాతం మందిలో అసలు కరోనా లక్షణాలే లేవట!
- అసోంలో దాదాపు 34 మందికి కరోనా
- కోలుకున్న 12 మంది
- ఇప్పటివరకు 4,400 మందికి పరీక్షలు
- పలు రాష్ట్రాల కంటే అసోంలో అధికంగా టెస్టులు
కరోనా మహమ్మారి మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. తాము కరోనా బారిన పడ్డామన్న విషయాన్ని కూడా తెలియనివ్వకుండా నిలువెత్తు మనిషిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. టక్కుటమారి కరోనా ఊహించిన దానికంటే ప్రమాదకరమేనని వెల్లడవుతోంది. అసోంలో పాజిటివ్‌గా తేలిన 82 శాతం మందికి కరోనా లక్షణాలు కనపడలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మిమంత బిష్వా శర్మ ప్రకటించారు.
'ఈ వైరస్ నిశ్శబ్దంగా తన పనిచేసుకుపోతోంది. చికిత్స చేస్తోన్న సమయంలోనూ చాలా మందికి కరోనా లక్షణాలు కనపడలేదు' అని శర్మ వెల్లడించారు. అసోంలో 34 మంది కరోనా బారినపడ్డారు. 12 మంది కోలుకున్నారు. కరోనాతో బాధపడుతున్న వారి వయసు 18 నుంచి 71 కి మధ్య ఉంది. వారిలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారే అధికంగా ఉన్నారు.
ఇప్పటివరకు 4,400 మందికి పరీక్షలు చేశారు. సగటున పది లక్షల మందిలో 120 మందికి పరీక్షలు చేసిన రాష్ట్రంగా అసోం నిలిచింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే అసోంలో పరీక్షలు నిర్వహించిన వారి సంఖ్య చాలా అధికం. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ కంటే అసోంలో అధికంగా టెస్టులు చేశారు. అసోంలో గోవాల్పరా, గోలఘాట్, నల్బరీ, ధుబ్రి, మోరిగావ్ జిల్లాలను హాట్స్పాట్లుగా ప్రకటించారు.