Yuvraj Singh: ఇప్పుడున్న పరిస్థితి క్రీడాకారులకు ఎప్పుడూ రాలేదు: యువరాజ్ సింగ్
- క్రీడాకారులు ఇంట్లోనే కూర్చోవడం మంచిది కాదు
- అయితే ఇంత ఖాళీ సమయం క్రీడాకారులకు దొరకదు
- మే 3 వరకు అందరం ఓపిక పట్టాల్సిందే
లాక్ డౌన్ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం గుర్గావ్ లోని తన ఇంట్లో వున్నాడు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో ఫోన్ లో మాట్లాడుతూ, క్రీడాకారులు ఇలా ఖాళీగా ఇంట్లోనే కూర్చోవడం మంచిది కాదని, కానీ ఈ పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదని అన్నాడు.
లాక్ డౌన్ పూర్తయ్యే వరకు అందరూ సహనంతో ఓపికపట్టాలని సలహా ఇచ్చాడు. అయితే, ఇంత ఖాళీ సమయం క్రీడాకారులకు ఎప్పుడూ రాదని... కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇప్పుడు సమయం దొరికిందని అన్నాడు. ఈ లాక్ డౌన్ కు ముందు క్రీడాకారులు ఇంటి వద్ద ఉండే పరిస్థితి లేదని చెప్పాడు.
తన కెరీర్ తొలి నాళ్లలో ఇలాంటి పరిస్థితులు ఎదురయి ఉంటే చాలా ఇబ్బందిగా ఉండేదని యువరాజ్ అన్నాడు. తమ కెరీర్ లో తమకు ఎప్పుడూ ఆఫ్ సీజన్ లేదని... ఏడాదిలో 10 నుంచి 11 నెలలు క్రికెట్ ఆడుతూనే ఉండేవారమని చెప్పాడు. మిగిలిన సమయం ప్రయాణాలకు సరిపోయేదని అన్నాడు. తను ఇప్పటికే రిటైర్ కావడం తన అదృష్టమని... లేకపోతే ఈ లాక్ డౌన్ సమయంలో చాలా కష్టంగా ఉండేదని చెప్పాడు. మే 3వ తేదీ వరకు అందరం ఓపిక పట్టాల్సిందేనని చెప్పాడు.
ప్రస్తుతం మనమంతా చాలా లక్కీ అని... ఎందుకంటే నాకు, మీకు ఇంట్లో మూడు లేదా నాలుగు గదులు ఉన్నాయని.. దేశంలో చాలా మంది పెద్ద కుటుంబంతో ఒకే గదిలో నివసిస్తున్నారని యువీ అన్నాడు.