AP High Court: ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు.. తెలంగాణకు ఒకరు.. ‘సుప్రీం’ కొలీజియం సిఫార్సు!
- ఏపీకి కేటాయించిన వారిలో ఇద్దరు గుంటూరు, ఒకరు అనంతపురం జిల్లా వాసులు
- తెలంగాణ హైకోర్టుకు బి.విజయ్‌సేన్ రెడ్డి
- జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి కుమారుడే విజయ్‌సేన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా మరో ముగ్గురు న్యాయమూర్తులు రాబోతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే, తెలంగాణకు కూడా ఓ న్యాయమూర్తిని కొలీజియం కేటాయించింది. ఏపీకి కేటాయించిన వారిలో బొప్పూడి కృష్ణమోహన్, కె. సురేశ్‌రెడ్డి, కె.లలితకుమారి అలియాస్ లలిత పేర్లు ఉండగా, తెలంగాణ హైకోర్టుకు బి.విజయసేన్‌రెడ్డిని నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్‌కుమార్ మిశ్రా, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ ఆర్. భానుమతితో కూడిన కొలీజియం నిన్న సిఫార్సు చేసింది.
గుంటూరు జిల్లాకు చెందిన బొప్పూడి కృష్ణమోహన్ 10 ఏళ్లపాటు కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాదిగా పనిచేశారు. హైకోర్టు విభజన అనంతరం 2019 నుంచి ఏపీ హైకోర్టులో కేంద్రం తరపున సహాయ సొలిసిటర్ జనరల్‌గా కొనసాగుతున్నారు.
లలిత కుమారిది కూడా గుంటూరు జిల్లానే. ప్రస్తుతం తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయ స్టాండింగ్ కౌన్సెల్‌గా కొనసాగుతున్నారు. కంచిరెడ్డి సురేశ్‌రెడ్డిది అనంతపురం జిల్లా. హైకోర్టులో క్రిమినల్, సివిల్, రాజ్యాంగానికి సంబంధించిన కేసుల్లో మంచి పట్టున్న ఆయన ప్రముఖ న్యాయవాది టి.బాల్‌రెడ్డి వద్ద జూనియర్‌గా తన వృత్తిని ప్రారంభించారు.
తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన బి.విజయ్‌సేన్‌రెడ్డి హైదరాబాద్‌కు చెందిన వారు. జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి కుమారుడే విజయ్‌సేన్ రెడ్డి. 1994లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయిన విజయ్‌సేన్ రెడ్డికి రాజ్యాంగ, సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి పట్టుంది.