Corona Virus: ఫ్రాన్స్‌లో నిన్న ఒక్క రోజే 547 మంది మృతి
- కరోనా మరణాల్లో నాలుగో స్థానంలో ఫ్రాన్స్
- ఇప్పటి వరకు 20,265 మంది మృత్యువాత
- ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,70,436 మంది బలి
ఫ్రాన్స్‌లో కరోనా మరణాల సంఖ్య 20 వేలు దాటిపోయింది. ఈ మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్న తొలి ఐదు దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. 1.55 లక్షల మందికిపైగా ఇక్కడ ఈ ప్రాణాంతక వైరస్‌తో బాధపడుతున్నారు. నిన్న కొత్తగా 547 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా మరణించిన వారి మొత్తం సంఖ్య 20,265కు పెరిగింది. ఈ మేరకు ఆ దేశ వైద్యాధికారులు ప్రకటించారు. అలాగే, 37,409 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇంకా 97,709 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 24,81,287 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 1,70,436 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక దాదాపు ఆరున్నర లక్షల మంది కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. అలాగే, కరోనా బారినపడి విలవిల్లాడుతున్న అమెరికాలో ఇప్పటి వరకు 42,514 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాతి స్థానాల్లో స్పెయిన్ (20,852), ఇటలీ (24,114) ఉండగా, ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉంది.