North Korea: అత్యంత ప్రాణాపాయ స్థితిలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్?
- ఇటీవల కిమ్ జాంగ్ ఉన్ గుండెకు ఆపరేషన్
- ఆపై విషమించిన ఆరోగ్యం
- సీఎన్ఎన్ ప్రత్యేక కథనం
- ధ్రువీకరించడం అసాధ్యమన్న సౌత్ కొరియా మీడియా సంస్థ
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయనకు ఓ సర్జరీ జరుగగా, ఆపై ఆరోగ్యం క్షీణించిందని, ఆ దేశంలోని పరిస్థితిని యూఎస్ నిఘా వర్గాలు గమనిస్తున్నాయని సీఎన్ఎన్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
గత వారం వైభవంగా జరిగిన తన తాతయ్య పుట్టిన రోజు వేడుకలకు కిమ్ హాజరుకాలేదు. అనారోగ్యం కారణంగానే ఆయన రాలేదని తెలుస్తోంది. సర్జరీ తరువాత కిమ్ పరిస్థితి ప్రమాదకరంగా మారిందని, ఉత్తర కొరియా పరిస్థితులపై నిఘా ఉంచిన యూఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇదే విషయమై స్పందించేందుకు వైట్ హౌస్ మాత్రం నిరాకరించింది.
ఇదిలావుండగా, సియోల్ కేంద్రంగా పని చేస్తున్న 'ది డెయిలీ ఎన్కే' మరో కథనాన్ని ప్రచురిస్తూ, కిమ్ గుండెకు ఆపరేషన్ జరిగిందని, ఆయన రికవర్ అయ్యారని, అయితే, రికవరీ విషయాన్ని బయటివారు ధ్రువీకరించడం మాత్రం అసాధ్యమని పేర్కొంది.
కాగా, ఉత్తర కొరియాలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే కిమ్ జాడ అతి రహస్యంగా ఉంటుంది. ఆయనకు దగ్గరివారైన అతి కొద్ది మందికి మాత్రమే విషయం తెలుస్తుంది. ఈ నెల 15న జరిగిన దేశ వ్యవస్థాపకుడు, కిమ్ తాతయ్య కిమ్ 2 సుంగ్ పుట్టినరోజు నాడు కిమ్ జాంగ్ ఉన్ కనిపించకపోవడం, దేశ ప్రజల్లో చర్చనీయాంశమైంది.
దీనిపై స్పందించిన ప్రభుత్వం, ఈ సంవత్సరంలో ఆయన 17 సార్లు ప్రజల ముందుకు వచ్చారని గుర్తు చేసింది. ఏమైనా, కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఉత్తర కొరియా నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే అసలు విషయం ప్రపంచానికి తెలుస్తుందని చెప్పచ్చు.