America: కరోనా తిరగబెడితే అదుపుచేయడం కష్టమే: అమెరికా నిపుణులు
- సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ అధికారుల ముందస్తు హెచ్చరికలు
- చైనా, జపాన్, దక్షిణకొరియాలో పరిస్థితిపై ఆందోళన
- శీతాకాలం వస్తే మరీ ప్రమాదమని స్పష్టీకరణ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి ఏ దేశానికి ఆ దేశం స్వీయ చర్యలు చేపడుతున్నాయి. కొన్ని దేశాలు బయటపడుతుండగా, మరికొన్ని దేశాలు కొత్తగా దీని బారిన పడుతున్నాయి. అయితే కరోనా నుంచి బయటపడిన దేశాలు సంతృప్తి చెందాల్సిన అవసరం లేదని, వైరస్ తిరగబెడితే చాలా ప్రమాదమని అమెరికాలోని సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు చైనా, జపాన్, దక్షిణ కొరియాలో మళ్లీ వెలుగు చూస్తున్న కేసుల వార్తలను వారు ఉదాహరణగా చూపుతున్నారు.
కరోనా వైరస్ తొలిసారి వెలుగు చూసిన చైనాలోని వూహాన్ నగరం కోలుకున్నట్టే కోలుకుని ఇటీవల మళ్లీ కేసుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. వైరస్‌తో నగరం అతలాకుతలమైంది. 76 రోజులు లాక్డౌన్ అనంతరం పదిరోజుల క్రితమే మళ్లీ అక్కడి జనం స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చారు. అంతా బాగుందనుకున్న సమయంలో అక్కడ మళ్లీ బాధితులు వెలుగు చూశారు.
జపాన్, దక్షిణ కొరియాలోనూ ఇదే పరిస్థితి. చలికాలం మొదలయ్యాక కరోనా వైరస్ విజృంభిస్తే తట్టుకోవడం చాలా కష్టం అని, అందువల్ల వీలైనంత వేగంగా దీన్ని కట్టడి చేయాలని సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ హెచ్చరించారు.