Pawan Kalyan: చిల్లర రాజకీయాలు ఆపకపోతే.. జనాలు తిరగబడతారు: పవన్ కల్యాణ్
- కరోనాను పక్కన పెట్టి రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు
- కన్నాపై వ్యక్తిగత విమర్శలు ఇందులో ఒక భాగం
- ఏపీలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది
కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య వాగ్వాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కన్నాపై వైసీపీ నేతలందరూ వరుసగా విరుచుకుపడుతున్నారు. ఈ పరిణామాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలను అందించాల్సిన తరుణంలో... తప్పులను వేలెత్తి చూపుతున్న వారిపై వైసీపీ పెద్దలు బురద చల్లే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. కన్నాపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయని అన్నారు. కన్నాపై జరుగుతున్న దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన రీతిలో, ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడగాల్సిన స్థాయిలో ఉందని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించారు.
ఏపీలో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనే అధికార పార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని పవన్ అన్నారు. రెండు, మూడు రోజులుగా ఇలాంటి పరిణామాలే జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ ఆక్రమిస్తున్న కారణంగా అగ్ర రాజ్యాలు సైతం చిగురుటాకులా వణికిపోతున్నాయని, వాటి ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతోందని అన్నారు. రోగులందరికీ వైద్య సేవలు అందించలేక అగ్రదేశాలు అవస్థలు పడుతున్నాయని.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందులను పంపమని భారతదేశాన్ని ప్రాధేయపడుతున్నాయని చెప్పారు. ఇంకో పక్క పెట్రోల్ ధరలు పాతాళంలోకి పడిపోయి చమురు ఉత్పత్తి దేశాలు దిక్కులు చూస్తున్నాయని అన్నారు. ఈ పరిణామాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనపై ప్రభావాన్ని చూపేవేనని చెప్పారు.
మన దేశంలో లక్షలాది మంది కార్మికులు ముఖ్యంగా వలస కార్మికులు ఉపాధి కోల్పోయి, ఊరుకాని ఊర్లో ఉంటూ, అర్ధాకలితో అలమటిస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ పంటను అమ్ముకునే దారి లేక పెంటకుప్పల్లో పోస్తున్నారని చెప్పారు. ఏపీపై కూడా కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని అన్నారు. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ తప్పులను వేలెత్తి చూపే వారిపై వైసీపీ పెద్దలు బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ ఆపత్కాల సమయంలో జనసేన ఒకటే కోరుతోందని... రాష్ట్రాన్ని, దేశాన్ని కరోనా రక్కసి వదిలిపెట్టి పోయేంత వరకు చిల్లర రాజకీయాలను దూరంగా పెడదామని పవన్ అన్నారు. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులను తీర్చడంపై దృష్టిని కేంద్రీకరిద్దామని చెప్పారు. ఈ సమయంలో కూడా రాజకీయాలను ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హితవు పలికారు.