Donald Trump: గ్రీన్ కార్డుల జారీ కూడా నిలిపివేత: యూఎస్ మరో కీలక ప్రకటన

Trump Says Green Cards to be Halted Sixty Days

  • ఇప్పటికే వలస వీసాల జారీ నిలిపివేత
  • అమెరికన్లకు ఉద్యోగాలను దగ్గర చేసేందుకే
  • వెల్లడించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఇప్పటికే అన్ని రకాల వలస వీసాల జారీని 60 రోజులపాటు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా, ఇప్పుడు గ్రీన్ కార్డుల జారీని కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, రెండు నెలల పాటు గ్రీన్ కార్డుల జారీ ఉండబోదని ఆయన అన్నారు. గ్రీన్ కార్డులను పొందిన వారు యూఎస్ లో శాశ్వత నివాసులుగా గుర్తించబడతారన్న సంగతి తెలిసిందే. చాలా రకాల వీసా సేవలు ఇప్పటికే యూఎస్ లో నిలిచిపోగా, దీని ప్రభావం యూఎస్ నిరుద్యోగులకు ఏ విధంగా సహాయపడుతుందన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు.

కాగా, యూఎస్ లో కరోనా సోకి 45 వేల మంది వరకూ మరణించగా, వైరస్ పట్ల తన బాధ్యతను సక్రమంగా ట్రంప్ నిర్వహించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ప్రజల దృష్టిని మళ్లించడానికే ట్రంప్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

వాస్తవానికి వలసదారుల విధానాన్ని సవరిస్తున్నానన్న ట్రంప్ ప్రకటన, అది ఆయన తదుపరి ఎన్నికలకు బలమైన ప్రచార సాధనమే అయినప్పటికీ, కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాల వల్ల అది ఆయనకు అక్కరకు రాకుండా పోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజాగా వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఈ నిషేధాన్ని పొడిగించే ఆలోచన కూడా ఉందని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో యూఎస్ కు తాత్కాలికంగా వచ్చి వెళ్లే వారిపై తన నిర్ణయం ఎటువంటి ప్రభావాన్నీ చూపించబోదని ట్రంప్ పేర్కొన్నారు. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాదారులు, వ్యవసాయ పనుల కోసం అమెరికాకు వచ్చే విదేశీయులపైనా ప్రభావం ఉండదని భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డ అమెరికన్లకు, కరోనా అనంతరం ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం దక్కేలా చేయడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News