North India: ఉత్తర భారతాన గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి తగ్గిన వాయు కాలుష్యం: నాసా
- వాయు కాలుష్యం తగ్గినట్టు గుర్తించిన ఉపగ్రహాలు
- ప్రపంచ వ్యాప్తంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న శాస్త్రవేత్త పవన్
- మార్చి 27న కురిసిన వర్షం కూడా కాలుష్యం తగ్గడానికి మరో కారణం
ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం భారీగా తగ్గిందని... 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి తగ్గిందని అమెరికా స్పేస్ ఏజెన్సీ 'నాసా' ప్రకటించింది. కరోనా లాక్ డౌన్ కారణంగా కాలుష్య స్థాయులు అమాంతం తగ్గాయని తెలిపింది. ఈ విషయాన్ని తమ ఉపగ్రహాలు గుర్తించాయని పేర్కొంది.
ఈ సందర్భంగా యూనివర్శిటీస్ స్పేస్ రీసర్చ్ అసోసియేషన్ (యూఎస్ఆర్ఏ) శాస్త్రవేత్త పవన్ గుప్తా మాట్లాడుతూ, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. లాక్ డౌన్ తొలి నాళ్లలో వాయు కాలుష్యంలో తేడాను గుర్తించడం కష్టమైందని చెప్పారు.
లాక్ డౌన్ తొలి వారంలో కాలుష్యం తగ్గుముఖం పట్టడాన్ని గుర్తించామని... అయితే, అది వర్షం, లాక్ డౌన్ రెండింటి కలయికతో జరిగిందని చెప్పారు. మార్చి 27న ఉత్తరాదిలో భారీ వర్షం కురిసింది. దీంతో, గాల్లోని ఇతర కాలుష్య కణాలు తగ్గిపోయాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాహనాల ప్రయాణాలు ఆగిపోవడంతో కాలుష్యం భారీగా తగ్గుముఖం పట్టింది.