Lockdown: తాగేంత స్వచ్ఛంగా మారిన గంగానది నీరు!
- లాక్డౌన్తో తగ్గిన కాలుష్యం
- పరిశ్రమల వ్యర్థాల రాక ఆగడంతో పెరిగిన నీటి నాణ్యత
- ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడి
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా వాతావరణ కాలుష్యం పూర్తిగా తగ్గిపోయింది. దాదాపు నెల రోజుల నుంచి వాహనాలు రోడ్డెక్కకపోవడంతో వాయు కాలుష్యం మాటే లేకుండా పోయింది. గాలి మాత్రమే కాదు పలు నదుల్లోని నీటి కాలుష్యం కూడా తగ్గింది. లాక్డౌన్తో పరిశ్రమలు మూతపడడం.. వాటి నుంచి వచ్చే వ్యర్థాలు నదుల్లో కలవడం ఆగిపోయంది. దాంతో చాలా నదుల్లో నీరు స్వచ్ఛంగా మారింది. ముఖ్యంగా కాలుష్యంతో నిండివుండే పవిత్ర గంగానదిలోని నీరు తాగేంత స్వచ్ఛంగా మారడం విశేషం.
గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇది వరకే అనేక చర్యలు చేపట్టాయి. పరిశ్రమల వ్యర్థాలు నదిలో కలవకుండా చర్యలు తీసుకున్నాయి. అయినా పెద్దగా మార్పు కనిపించింది లేదు. కానీ, లాక్డౌన్ పుణ్యమా అని గంగా నది రూపు మారింది. హరిద్వార్, రిషికేశ్ లో ప్రవహించే నది నీరు గతంలో ఎన్నడూ లేనంతగా శుభ్రపడి తాగడానికి కూడా ఉపయోగపడేలా మారిందని ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. 2000వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇలా గంగానది నీరు స్వచ్ఛంగా మారడం ఇదే మొదటి సారి అని పేర్కొంది.
గంగా నది నీళ్లలో ఆక్సిజన్ స్థాయి కూడా పెరిగిందని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) తెలిపింది. సాధారణంగా ఈ నదిలో 80 శాతం ధూళి, మురుగు నీరు, కాలుష్యం ఉంటుందని, కానీ, లాక్డౌన్తో అది గణనీయంగా తగ్గినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. యమునా నది నీటి నాణ్యత కూడా పెరిగిందని చెప్పారు.