manmohan singh: అప్పుడే లాక్డౌన్ విజయవంతమైందా? లేదా? అన్న విషయం తెలుస్తుంది: మన్మోహన్ సింగ్
- కొవిడ్-19ను కట్టడి చేస్తేనే లాక్డౌన్ విజయవంతమైనట్లు
- కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య సహకారం కొనసాగాలి
- కొవిడ్-19పై పోరులో విజయం సాధించడంలో ఇదే కీలకం
- తలెత్తుతున్న సమస్యలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం
దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడకుండా రోజురోజుకీ కేసులు పెద్ద ఎత్తున పెరిగిపోతోన్న విషయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ... చివరకు కొవిడ్-19ను కట్టడి చేశామా? లేదా? అన్న అంశమే లాక్డౌన్ విజయవంతమైందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారిస్తుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య సహకారమే కొవిడ్-19పై పోరులో విజయం సాధించడంలో కీలకమని మన్మోహన్ సింగ్ అన్నారు. కరోనా నేపథ్యంలో ఏర్పడుతున్న అనేక సమస్యలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని తెలిపారు. కరోనాపై పోరు విజయం సాధించడం అనే అంశం మనకున్న వనరులపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయిలో పతనమైనప్పటికీ భారత్లో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేదని, సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం భారం వేస్తోందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు.