Gautam Gambhir: కుంబ్లే ఎక్కువ కాలం కెప్టెన్ గా కొనసాగివుంటే ప్రతి రికార్డు బద్దలయ్యేది: గంభీర్
- కుంబ్లేని అత్యుత్తమ కెప్టెన్ గా పేర్కొన్న గంభీర్
- కుంబ్లే సారథ్యంలో 6 టెస్టులు ఆడినట్టు వెల్లడి
- 14 టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన కుంబ్లే
క్రికెటర్ నుంచి రాజకీయనాయకుడిగా మారిన గౌతమ్ గంభీర్ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆడిన కాలంలో కుంబ్లేనే అత్యుత్తమ సారథి అని గంభీర్ అభివర్ణించాడు. కుంబ్లే భారత్ కు ఎక్కువకాలం కెప్టెన్ గా కొనసాగివుంటే సారథ్యానికి సంబంధించిన ప్రతి రికార్డు బద్దలయ్యేదని అన్నాడు.
కెప్టెన్ గా ఎంఎస్ ధోనీ అనేక ఘనతలు సాధించినా, కుంబ్లేనే బెస్ట్ అని భావిస్తానని తెలిపాడు. సౌరవ్ గంగూలీ కూడా ఎన్నో విజయాలు అందుకున్నా, భారత్ కు సుదీర్ఘకాలం కెప్టెన్ గా వ్యవహరించదగ్గ వ్యక్తిగా కుంబ్లేనే కోరుకుంటానని వెల్లడించాడు. కుంబ్లే సారథ్యంలో తాను 6 టెస్టులు ఆడానని గంభీర్ తెలిపాడు.
లెగ్ స్పిన్నర్ గా ప్రపంచప్రఖ్యాతి గాంచిన కుంబ్లే 2007లో రాహుల్ ద్రావిడ్ నుంచి టీమిండియా పగ్గాలు అందుకున్నాడు. 14 టెస్టుల్లో భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించగా, భారత్ మూడు టెస్టుల్లో నెగ్గి, ఆరింట ఓడింది. మరో ఐదు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.