Prakash Raj: రోగులను ఓ డాక్టర్ ఎలా చూస్తాడో వాళ్లను అలా చూస్తా: ప్రకాశ్ రాజ్
- గతంలో తనకు బెదిరింపులు వచ్చేవని వెల్లడి
- ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారన్న ప్రకాశ్ రాజ్
- కొడుకు ఫొటో పోస్టు చేస్తే 'నీ మనవడా?' అన్నారని ఆవేదన
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఓ తెలుగు మీడియా చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తనను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చేవని, అయితే తాను పిరికివాడ్ని కాదని స్పష్టం చేశారు. ఒకర్ని చంపేద్దామని భావించేవాళ్లు తన దృష్టిలో చచ్చిపోయిన వాళ్ల కింద లెక్క అని అభిప్రాయపడ్డారు. తమలోని మానవత్వాన్ని చంపేసుకుంటేనే ఎదుటివాళ్లను చంపగలరని, ఆ లెక్కన ఒకర్ని చంపాలనుకున్నవాళ్లు ఎప్పుడో చచ్చిపోయినట్టుగా భావిస్తానని తెలిపారు.
ప్రస్తుతం తనకు బెదిరింపులు ఏమీ రాకపోయినా సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తుంటారని, రోగులను ఓ డాక్టర్ ఎలా చూస్తాడో అలాంటి విమర్శకులను తానూ అలాగే చూస్తానని ప్రకాశ్ రాజ్ వివరించారు. ఇటీవల తన కుమారుడి ఫొటో పోస్టు చేస్తే నీ మనవడా అని, ఎన్నో భార్య కొడుకు అని వెటకారం చేశారని వెల్లడించారు. అయితే ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని, వాళ్ల నాలుకల్లో ఉన్న విషం అలాంటిదని అన్నారు. తాను నీలకంఠుడ్నని, అలాంటి విషపు వ్యాఖ్యలను జీర్ణించుకోగల సత్తా తనకు ఉందని ఉద్ఘాటించారు.