MSME: వేతన ఉద్దీపనను ప్రకటించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం!
- ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని భావిస్తున్న మోదీ సర్కారు
- ఆర్థిక చేయూతను ఇచ్చేలా నిధుల విడుదల
- త్వరలోనే విధివిధానాల ఖరారు
కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) లను ఆదుకునేందుకు కేంద్రం ఓ వేతన ఉద్దీపన పథకాన్ని ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలోని ఎంఎస్ఎంఈ సంస్థలు కరోనాపై పోరాటంలో ముందడుగు వేసి, నిలబడాలంటే, వారికి ఆర్థిక చేయూతను అందించడం తప్పనిసరని భావిస్తున్న కేంద్రం, ఈ మేరకు త్వరలోనే ఉద్దీపన విధివిధానాలను నిర్ణయిస్తుందని సమాచారం.
ఇందులో భాగంగా, ఎంఎస్ఎంఈ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు రుణ సదుపాయంతో పాటు వలస కార్మికులను ఆదుకునేందుకు నిర్ణయాలు తీసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.