Summer: ఎండలు మండేకాలం... ఏపీలో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత!
- అనంతపురం జిల్లాలో పెరిగిన వేడిమి
- మడకసిరలో అత్యధికంగా 42.3 డిగ్రీలు
- తెలంగాణలోనూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో శనివారం నాడు అత్యధికంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మడకశిర ప్రాంతంలో వేడి పెరిగిపోయిందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం వెల్లడించింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వేడి అధికంగా నమోదవుతోందని, అనంతపురం పట్టణం, వజ్రకరూరు, గుంతకల్లు, యాడికి, గుత్తి, నార్పల తదితర ప్రాంతాల్లో 39 నుంచి 41 డిగ్రీల వేడిమి నమోదైందని పేర్కొంది. అటు విజయవాడ, మచిలీపట్నం, విశాఖ, గుంటూరు, నెల్లూరు తదితర ప్రాంతాల్లోనూ ఎండలు పెరిగాయి.
మరోవైపు తెలంగాణలో సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల వరకూ పెరిగి 40 డిగ్రీలను దాటింది. శనివారం నాడు పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రామగుండం, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి తదితర ప్రాంతాల్లో వేడి అధికంగా ఉందని వాతావరణ విభాగం పేర్కొంది.