Corona Virus: కరోనా కట్టడికి శ్రమిస్తోన్న అధికారులు, సిబ్బందికి తెలంగాణ మంత్రి పూలాభిషేకం!
- ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ పర్యటన
- పేదలకు నిత్యావసరాల పంపిణీ
- మే 7 కల్లా ఖమ్మం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా ఉండదు
మే 7 కల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా ఉండదని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరులో పేదలకు ఈ రోజు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చేతి వృత్తుల కుటుంబాలకు ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో ఈ సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి కోసం శ్రమిస్తోన్న స్థానిక అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య, ఆశా కార్యకర్తలు, పోలీసులకు పువ్వాడ పూలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో దినసరి కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేదలను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకు వస్తున్నారని, వారు చేస్తోన్న సాయం అభినందనీయమని తెలిపారు.
లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ఇక్కడి ప్రజలకు సండ్ర అండగా ఉంటూ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా విజృంభణతో ఏర్పడే సమస్యలను సీఎం కేసీఆర్ ముందుగానే అంచనా వేసి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.