Arvind Kejriwal: ఎట్టకేలకు ఢిల్లీలో లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన కేజ్రీవాల్‌!

Coronavirus in Delhi Chief Minister Arvind Kejriwal on lockdown

  • నిన్న సడలింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్
  • ఇప్పుడు కొన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతి
  • కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటన
  • ప్లాస్మా థెరపీ కోసం, కోలుకున్న రోగులు ప్లాస్మా ఇవ్వాలని కోరిన కేజ్రీవాల్

ఢిల్లీలో లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీలో దుకాణాలను తెరచుకునే విషయంలో మరి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'కొన్ని దుకాణాలను తెరవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తున్నాం. మెడికల్‌, కిరాణా స్టోర్లతో పాటు కూరగాయల దుకాణాలు, డైరీలు ఇకపై తెరిచే ఉంటాయి' అని తెలిపారు.

అయితే, షాపింగ్‌ కాంప్లెక్స్‌, మార్కెట్లు వంటివి మూసే ఉంటాయని కేజ్రీవాల్ ప్రకటించారు. అలాగే, కట్టడి ప్రాంతాల్లో మాత్రం ఏ దుకాణాలూ తెరచుకోవని తెలిపారు. స్థానికంగా ఉండే దుకాణాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలు పాటిస్తామని చెప్పారు.

కాగా, కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ చికిత్స గురించి ఆయన మాట్లాడుతూ... ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో ఓ రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనకు ప్లాస్మా తెరపీ చికిత్స అందించామని, దీంతో ఆయన కోలుకున్నాడని తెలిపారు. దీంతో ప్లాస్మా థెరపీపై  ఆసక్తి పెరిగిందని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న రోగులు ప్లాస్మా ఇవ్వాలని తాము కోరుతున్నామని ఆయన చెప్పారు.  

ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వగా కేజ్రీవాల్‌ మాత్రం నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా  విజృంభిస్తుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆంక్షలు సడలిస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఢిల్లీలోనూ దుకాణాలను తెరుస్తామని చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News