Vijaya Devarakonda: ప్రస్తుత, భవిష్యత్ అవసరాల కోసం హీరో విజయ్ దేవరకొండ భారీ సాయం
- ప్రస్తుతం సంక్షోభం గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉంది
- చాలా మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు
- నిత్యావసరాలు లేక ఇబ్బంది పడే వారికి సాయం
- యువతకు తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ ఇస్తాం
లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం సంక్షోభంతో తన అకౌంట్ లో కూడా తగిన డబ్బులు లేవని, తన కుటుంబసభ్యులతో పాటు 35 మందికి జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నాడు. డబ్బుల్లేకపోవడం అనేది తనకు కొత్తేమీ కాదు అలవాటే కానీ, ఎంప్లాయీస్ కు జీతాలు ఇవ్వడమనేదే తనకు కొత్త అని చెప్పారు. ప్రొడక్షన్ హౌస్, తన పేరిట ఉన్న ఫౌండేషన్ యాక్టివిటీస్ ను గతంలో ప్రారంభించానని, తమ పర్సనల్ స్టాఫ్ కూడా పెరిగిందని చెప్పాడు. తన ఇంటి విషయాన్ని పక్కనపెట్టి, బయట ప్రపంచాన్ని చూస్తే.. చాలా మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారని అన్నాడు. ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉందని, వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపిస్తోందని చెప్పాడు. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రంగంలోకి దిగుతున్నామని అన్నారు.
టీడీఎస్ ద్వారా యువతకు స్కిల్ డెవలప్ మెంట్
ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్ (టీడీఎస్)ను గతంలోనే ఏర్పాటు చేశానని, ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పకూడదనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తప్పట్లేదని అన్నాడు. ఈ ఫౌండేషన్ తరఫున విద్యార్థులను ఎంపిక చేసి వారికి నచ్చిన రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు పొందేలా చేస్తామని అన్నారు. టీడీఎస్ కు ఒక కోటి రూపాయలు ప్రకటిస్తున్నానని తెలిపారు. ‘రౌడీ వేర్’ నుంచి పలు రకాలు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రకటించారు.
నిత్యావసరాలు లేక ఇబ్బంది పడే వారికి ఎంసీఎఫ్ నుంచి సాయం
నిత్యావసరాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి కుటుంబాల కోసం మిడిల్ క్లాస్ ఫౌండేషన్ (ఎంసీఎఫ్) సాయం అందిస్తామని, రూ.25 లక్షలతో ఎంసీఎఫ్ ను ఏర్పాటు చేశానని చెప్పారు. www.thedeverakondafoundation.org వెబ్ సైట్ లో లాగిన్ అయి తమ వివరాలను తెలియజేస్తే, తమ టీమ్ కాల్ చేస్తుందని తెలిపారు. ఇంటికి దగ్గర ఉన్న కిరాణా షాపుకో, సూపర్ మార్కెట్ కు వెళ్లి సరుకులు కొనుగోలు చేస్తే తాము దుకాణపు యజమానికి డబ్బులు చెల్లిస్తామని వివరించారు.