L Type: వుహాన్ లో వ్యాప్తిచెందిన కరోనా వైరస్ రకానికి గుజరాత్ లో విస్తరిస్తున్న వైరస్ కు పోలికలు
- వుహాన్ ను వణికించిన 'ఎల్' టైప్ కరోనా వైరస్
- గుజరాత్ లోనూ 'ఎల్' టైప్ వైరస్ ఛాయలు
- ఇది చాలా శక్తిమంతం అంటున్న పరిశోధకులు
చైనాలోని వుహాన్ లో జన్మించిన కరోనా మహమ్మారి ఆ తర్వాత 30 రకాల వైరస్ లుగా పరివర్తన చెంది ప్రపంచ వ్యాపితమైంది. వుహాన్ లో మొదలైన కరోనాను 'ఎల్' టైప్ వైరస్ గా గుర్తించారు. వుహాన్ 50 వేలకు పైగా కేసులు నమోదు కాగా, 3,800 వరకు మరణించారు. ఇప్పుడదే ఎల్ టైప్ వైరస్ గుజరాత్ లోనూ వెలుగుచూసింది. గుజరాత్ లో విస్తరిస్తున్న కరోనా వైరస్ ను 'ఎల్' టైప్ కరోనా వైరస్ గా గుర్తించారు. భారత్ లో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఉంది.
గుజరాత్ లో కరోనా ఇంత తీవ్రంగా ఉండడానికి కారణం అది 'ఎల్' టైప్ వైరస్ అయ్యుండడమేనని నిపుణులు భావిస్తున్నారు. వ్యాప్తిలో ఉన్న 'ఎస్' టైప్ కరోనా వైరస్ కంటే 'ఎల్' టైప్ కరోనా వైరస్ శక్తిమంతమైనదని తమ పరిశోధనల్లో గుర్తించామని గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ (జీబీఆర్సీ) పరిశోధకులు చెబుతున్నారు. కరోనా రోగుల్లో అత్యధికుల మరణానికి ఈ 'ఎల్' టైప్ వైరస్సే కారణమని విదేశాల్లో పలు అధ్యయనాలు కూడా వెల్లడించాయి. గుజరాత్ లో ఇప్పటివరకు 3,071 కేసులు నమోదు కాగా, 133 మంది మరణించారు.