Britain: భారత్ లో కంటే బ్రిటన్ లోనే అధిక సంఖ్యలో భారతీయుల మృతి?
- భారత్ లో 872 మరణాలు
- బ్రిటన్ లో వెయ్యికిపైగా భారత సంతతి ప్రజలు చనిపోయి ఉంటారని కథనాలు
- ప్రతి 10 మంది కరోనా మృతుల్లో ఒకరు భారత సంతతి వ్యక్తి!
భారత్ లో కరోనా వ్యాప్తి జనవరి చివరివారంలో మొదలైందని చెప్పుకుంటే, అప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 27,892 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 872 మంది మరణించారు. బ్రిటన్ లోనూ ఇంచుమించు ఇదే సమయంలో వైరస్ విజృంభణ మొదలైంది. అయితే అక్కడ మనకంటే దారుణ పరిస్థితులు ఉద్భవించాయి. ప్రస్తుతానికి కరోనా బాధితుల సంఖ్య 1.53 లక్షలు కాగా, మరణాల సంఖ్య 20,732కి చేరింది. ఆసక్తికర అంశం ఏమిటంటే, భారత్ లో మరణాలు వెయ్యి లోపే ఉండగా, బ్రిటన్ లో మరణించిన భారత సంతతి ప్రజల సంఖ్య వెయ్యికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది.
బ్రిటన్ లో అధికారిక మరణాలకు, వాస్తవ గణాంకాలకు తేడా ఉందంటున్నారు. ఇళ్లలో చనిపోయిన వారిని, కేర్ హోమ్ లలో మరణించినవారిని కరోనా మృతుల జాబితాలో చేర్చడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రుల్లో చనిపోయినవారినే కరోనా మరణాలుగా పరిగణిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి అనధికార మరణాలను కూడా లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వం చెబుతున్నవాటి కంటే 10 నుంచి 50 శాతం వరకు మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని ఓ కథనం పేర్కొంది.
మరో కథనం మరింత విస్మయకర అంశాలను వెల్లడించింది. బ్రిటన్ లో కరోనాతో మరణిస్తున్న ప్రతి 10 మందిలో ఒకరు భారతీయులని వివరించింది. ఈ సంఖ్య మరింత గణనీయంగా ఉంటుందని మరో వాదన. అంతేకాదు, బ్రిటన్ లోని ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లలో 40 శాతం ఆసియా సంతతి ప్రజలే చికిత్స పొందుతున్నారట. బ్రిటన్ లో కరోనాతో భారతీయులు అధిక సంఖ్యలో మరణిస్తున్నారనడానికి మరో ఆధారం కూడా లభ్యమైంది.` ఆచార సంప్రదాయాల ప్రకారం అంతిమసంస్కారాలు నిర్వహించేందుకు మత గురువులను సంప్రదిస్తున్న వారి సంఖ్య నానాటికీ హెచ్చుతోందట. గురుద్వారాలు, ఆలయాలు, ఇతర ప్రార్థనామందిరాల్లో అంతిమ సంస్కారాల అనంతర క్రతువుల కోసం పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు తెలుస్తోంది.
భారత్ లో జనాభా 130 కోట్లు కాగా, కరోనాతో 1000కి లోపే మరణాలు సంభవించాయి.. అదే బ్రిటన్ లో భారత సంతతి ప్రజల సంఖ్య 15 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆ లెక్కన చూస్తే బ్రిటన్ లో భారత సంతతి వాళ్ల మరణాల సంఖ్య భారత్ లో కంటే 1000 రెట్లు అధికం అంటున్నారు!