RP Singh: ధోనీ గ్రాఫ్ పెరిగింది, నాది తగ్గింది... అయినా మా స్నేహం చెక్కుచెదరలేదు: ఆర్పీ సింగ్
- ఎడమచేతివాటం పేస్ తో ఆకట్టుకున్న ఆర్పీ సింగ్
- ధోనీతో బలమైన స్నేహసంబంధాలు
- ఇప్పటికీ మాట్లాడుకుంటామన్న ఆర్పీ
భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోనీది ప్రత్యేక అధ్యాయం. అన్ని ఫార్మాట్లలో జట్టుకు ప్రపంచకప్ లు అందించడం ధోనీకే చెల్లింది. ధోనీ హయాంలో ఎందరో క్రికెటర్లు ఉజ్వలంగా ప్రకాశించారు. అలాంటివారిలో ఎడమచేతివాటం పేసర్ ఆర్పీ సింగ్ ఒకడు.
ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీకి చెందిన ఆర్పీ సింగ్ 2007 టి20 ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, అనూహ్యరీతిలో తెరమరుగయ్యాడు. క్రికెటర్ గా కొనసాగిన సమయంలో ధోనీతో ఏర్పడిన స్నేహం మరింత బలపడింది. ఇప్పటికీ అదే ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది. ప్రస్తుతం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఆర్పీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
జట్టులో ఉన్నప్పుడు తామిద్దరం ఎక్కువగా కలిసి ఉండేవాళ్లమని, కెప్టెన్ అయ్యాక ధోనీ గ్రాఫ్ పైపైకి చేరిందని, తన గ్రాఫ్ పతనం అయిందని తెలిపాడు. కానీ తమ స్నేహం మాత్రం ఇప్పటికీ పదిలంగానే ఉందని, తరచుగా మాట్లాడుకుంటామని, కలిసి పర్యటిస్తుంటామని వివరించాడు. అయితే క్రికెట్ విషయాల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్లకున్నాయని ఆర్పీ చెప్పాడు.
స్వింగ్ బౌలర్ గా పేరుగాంచిన ఆర్పీ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్ లో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్ లలో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఒక దశలో మెరుగైన బౌలర్ గా ఉన్నా జట్టులో స్థానం మాత్రం పదిలపరుచుకోలేకపోయానని, మూడ్నాలుగు సీజన్లలో ఐపీఎల్ లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచినా, టీమిండియాలో పునరాగమనం చేయలేకపోయానని ఆర్పీ ఆవేదన వ్యక్తం చేశాడు.