Nara Lokesh: ఈ-క్రాప్ బుకింగ్ తో సంబంధం లేకుండా ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరపాలి: లోకేశ్ డిమాండ్
- రైతుల గోడు వినేవారే కరవయ్యారని ఆవేదన
- పంటలు రోడ్లపై పారబోస్తున్నారని వెల్లడి
- అప్పుల భారం పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ లేఖ
రాష్ట్రంలో ఉద్యానవన పంటల రైతుల గోడు వినేవారే కరవయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, అన్నదాతలు తాము పండించిన పంటలను అమ్ముకోలేక అవస్థలు పడుతుంటే పట్టించుకోవాల్సిన సీఎం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పంటలను కొనుగోలు చేస్తున్నామనే వ్యవసాయమంత్రి హామీ అరకొరగానే అమలవుతోందన్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో రైతులు తమ పంటలను రోడ్లపైనే పారబోస్తున్న విషయం మీ దృష్టికి రాలేదా? అంటూ సీఎం జగన్ ను నిలదీశారు. మొద్దు నిద్ర నటిస్తున్నారా? అంటూ మండిపడ్డారు. ఆరుగాలం పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో అప్పులభారం పెరిగి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. అందుకే ఈ-క్రాప్ బుకింగ్ తో సంబంధం లేకుండా ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు.