Lockdown: మే 3 తర్వాతా విద్యా సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌, ప్రజా రవాణా బంద్‌?

schools and malls and public transport remain shut after may 3

  • మత, రాజకీయ, క్రీడా కార్యక్రమాలపై మరికొంతకాలం నిషేధం! 
  • రెడ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగింపు
  • ఇతర ప్రాంతాల్లో దుకాణాలు, పరిశ్రమలు, కార్యాలయాలకు అనుమతి!
  • ఈ వారంలో నిర్ణయం వెల్లడించనున్న కేంద్ర ప్రభుత్వం

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం రెండోసారి ప్రకటించిన లాక్‌డౌన్‌ మే 3వ తేదీతో ముగియనుంది. తెలంగాణలో  మే 7వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ కొనసాగనుంది. అయితే, మలిదశ లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా దేశ వ్యాప్తంగా అనేక ఆంక్షలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

ముఖ్యంగా  ప్రజలు గుమికూడే ప్రదేశాలైన.. విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్‌, ప్రార్థనా స్థలాలు, ప్రజా రవాణాతో పాటు మత, రాజకీయ, క్రీడా కార్యక్రమాలపై నిషేధం కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉంది. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు కొనసాగించాలని  నిన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి పలువురు ముఖ్యమంత్రులు సూచించారు. దీనిపై కేంద్రం ఈ వారాంతం లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.

 రెడ్‌ జోన్లలో పూర్తిగా, మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా ఆంక్షలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో ఉండే కార్యాలయాలు, దుకాణాలు, పరిశ్రమలను అనుమతించాలని చూస్తోంది. రెడ్‌ జోన్లలో ఇప్పటిమాదిరిగానే అన్ని కార్యకలాపాలను నిలిపివేసి.. ఇతర జోన్లలో  ప్రజలు తాము పని చేసే చోటుకు వ్యక్తిగత వాహనాలపై వెళ్లి రావడానికి వీలు కల్పించే అవకాశం కనిపిస్తోంది.

అలాగే, సంస్థలు ఏర్పాటు చేసే వాహనాల్లో సామాజిక దూరం పాటిస్తూ  రాకపోకలు సాగించడానికి అవకాశం ఇచ్చే ఆలోచనలో కూడా కేంద్రం ఉంది.  వలస కార్మికులను సొంత ఊళ్లకు తరలించడంపై కూడా కేంద్రం ఒక నిర్ణయానికి రానుంది.  ఈ రోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగే మంత్రివర్గ బృందం సమావేశంలో, రేపు కేబినెట్‌ సమావేశం తర్వాత ఆంక్షల సడలింపుపై స్పష్టత రానుంది.

  • Loading...

More Telugu News