Donald Trump: చైనాపై మారని అభిప్రాయం... జర్మనీ కన్నా ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తామన్న ట్రంప్!

We are talking about a lot more money than Germany says Trump

  • కరోనా వల్ల ఎంతో నష్టపోయాం
  • చైనానే కారణం అని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి
  • లోతైన దర్యాప్తు జరుగుతోంది

ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ కు చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. చైనా వల్ల అమెరికాకు తీరని నష్టం వాటిల్లిందని ఆయన మండిపడుతున్నారు. కరోనా ఎక్కడ పుట్టిందో తేలుస్తామంటూ గతంలో చెప్పిన ట్రంప్... తాజాగా మరోసారి అదే మాట మాట్లాడారు.

చైనా తీరు తమకు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని ట్రంప్ అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అది పుట్టిన కేంద్ర స్థానంలోనే దాన్ని నియంత్రించి వుండాల్సిందని చెప్పారు. తక్షణమే ఈ దిశగా చర్యలు తీసుకోవాలని... లేకపోతే మరింత నష్టం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత దారుణ పరిస్థితికి మీరే బాధ్యులని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని చైనాను ఉద్దేశించి అన్నారు. దీనికి  సంబంధించి అమెరికా లోతైన దర్యాప్తును చేపడుతోందనే విషయం మీకు (చైనాకు) తెలిసే ఉంటుందని చెప్పారు.

కరోనా కారణంగా జరిగిన నష్టానికి గాను జర్మనీకి చైనా 165 బిలియన్ డాలర్లను చెల్లించాలంటూ ఒక జర్మన్ పత్రిక ఎడిటోరియల్ రాసిన సంగతి తెలిసిందే. అమెరికా కూడా ఇలాంటి డిమాండ్ చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు బదులుగా... ఆ పనిని తాము మరింత సులువుగా చేస్తామని చెప్పారు. జర్మనీ డిమాండ్ చేసేదానికన్నా ఎక్కువ మొత్తాన్ని తాము డిమాండ్ చేస్తామని తెలిపారు. ఎంత మొత్తం అనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. కరోనా కారణంగా అమెరికాతో పాటు ప్రపంచం మొత్తం నష్టపోయిందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News