Kanika Kapoor: ప్లాస్మా దానం చేస్తానంటున్న గాయని కనికా కపూర్!
- ఆసుపత్రిని సంప్రదించిన కనిక
- ఇప్పటికే శాంపుల్ ఇచ్చిన సింగర్
- తనకు వీలైనంత సాయం చేస్తానని ప్రకటన
కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ గాయని కనికా కపూర్ మంచి మనసు చాటుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మా కరోనా రోగుల చికిత్సలో పని చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ప్లాస్మా ఇచ్చేందుకు కరోనా రోగులు కొందరు ఒప్పుకోవట్లేదు. ఈ నేపథ్యంలో కనికా కపూర్ తన ప్లాస్మా ఇస్తానంటూ లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ వర్సిటీ (కేజీఎంయూ) ఆసుపత్రికి తెలిపింది. ఈ మేరకు ఆ ఆసుపత్రిలోని సంబంధిత అధికారికి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపింది.
'నిన్న ఉదయం నేను ఆ ఆసుపత్రికి ఫోన్ చేసి, నా రక్తం దానం చేస్తానని చెప్పాను. ఇవి కరోనా వైరస్‌పై పరిశోధనలు, చికిత్స కోసం ఉపయోగపడతాయి. నాకు వీలైనంత సాయం చేయాలని నేను అనుకుంటున్నాను. ప్లాస్మా దానం కోసం నిన్న నేను శాంపుల్ కూడా ఇచ్చాను' అని కనికా కపూర్ తెలిపింది.
ఆమె ప్లాస్మా చికిత్సకు పనికి వస్తుందా? అనే అంశాన్ని ముందు వైద్యులు పరీక్షిస్తారు. ఆ తర్వాత ఆమె ప్లాస్మాను కూడా ఇవ్వచ్చు. ఇందుకోసం ఆమె రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి 12.5 కన్నా అధికంగా ఉండాలి. ఆమె బరువు 50 కిలోగ్రాముల కన్నా అధికంగా ఉండాలి. ప్లాస్మా ఇచ్చే వారికి మధుమేహంతో పాటు హృదయ సంబంధ వ్యాధులు, మలేరియా వంటి ఇతర వ్యాధులు ఉండకూడదు.
కాగా, తాను ఇంట్లోనే స్వీయ క్వారంటైన్లో ఉన్నానని కనికా కపూర్ చెప్పారు. ఇంట్లో తన తల్లిదండ్రులతో గడుపుతున్నానని ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో చెప్పారు. కాగా, ఆమె మార్చి 10న యూకే నుంచి ముంబైకి తిరిగి వచ్చిన అనంతరం 11న విమానంలో సొంత ప్రాంతం లక్నోకి వెళ్లారు.
తన స్నేహితురాలు ఇచ్చిన విందుకు హాజరైన ఆమెకు.. అనంతరం కొన్ని రోజులకి కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేశారు. దీంతో పాజిటివ్‌గా తేలింది. ఉత్తరప్రదేశ్‌లోనే చికిత్స తీసుకున్నారు. యూకే వెళ్లొచ్చి కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమెపై పలు కేసులు నమోదయిన విషయం తెలిసిందే. ఆమె వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.