Rahul Gandhi: ఆర్బీఐ విడుదల చేసిన ఆర్థిక నేరగాళ్ల జాబితాలో బీజేపీ సన్నిహితులున్నారు: రాహుల్ గాంధీ
- అందుకే పార్లమెంటులో బీజేపీ వెనుకంజ వేసిందన్న రాహుల్
- తానడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి కూడా జవాబు చెప్పలేదని ఆరోపణ
- బీజేపీ వెనుకంజకు కారణమేంటో ఇప్పుడర్థమైందన్న రాహుల్
భారత బ్యాంకులను, ఇతర ఆర్థిక సంస్థలను మోసం చేసిన, రుణాలు ఎగ్గొట్టిన వాళ్లతో కూడిన 50 మంది జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ జాబితాలో బీజేపీకి సన్నిహితులైన వారి పేర్లు కూడా ఉన్నాయని, అందుకే పార్లమెంటులో ఈ జాబితాను వెల్లడి చేసేందుకు బీజేపీ వెనుకంజ వేసిందని ఆరోపించారు.
"ఈ విషయమై ఇప్పటికే పార్లమెంటులో ఓ ప్రశ్న అడిగాను.50 మంది అతిపెద్ద ఆర్థిక నేరగాళ్ల పేర్లు చెప్పమని కోరాను. కానీ ఆర్థిక మంత్రి అందుకు నిరాకరించారు. ఇప్పుడు ఆర్బీఐ నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీ, మరికొందరు బీజేపీ సన్నిహితుల పేర్లను జాబితాలో చేర్చింది. బీజేపీ ఈ వివరాలను పార్లమెంటులో ఎందుకు వెల్లడించలేదో ఇప్పుడర్థమైంది" అంటూ వ్యాఖ్యానించారు. సామాజిక కార్యకర్త సాకేత్ గోఖలే ఆర్థిక నేరగాళ్ల జాబితా ఇవ్వాలంటూ ఆర్బీఐకి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలోనే 50 మందితో కూడిన ఉద్దేశపూర్వక ఆర్థిక నేరగాళ్ల జాబితా వెల్లడైనట్టు భావిస్తున్నారు.