Telangana: ఇవాళ కూడా తెలంగాణలో సింగిల్ డిజిట్... కొత్తగా 6 కేసులు నమోదు
- రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1009
- ఇప్పటివరకు 25 మంది మృతి
- మే 8 నాటికి రాష్ట్రంలో కరోనా తగ్గిపోతుందన్న ఈటల
తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో స్వల్ప సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా మరో 6 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1009కి చేరింది. మొత్తం 25 మంది చనిపోయారు. ఇవాళ 42 మందిని డిశ్చార్జి చేశారు. తద్వారా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 374గా పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.
ఈ నెల 21 నుంచి తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించారు. మే 8 లోపు తెలంగాణలో కరోనా తగ్గిపోతుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెంది ఇక్కడ మరణించిన వారిని, ఇతర వ్యాధులతో మరణించిన కరోనా పాజిటివ్ వ్యక్తులను కూడా రాష్ట్ర మరణాల్లో చేర్చామని మంత్రి తెలిపారు.
పాజిటివ్ కేసులు తగ్గిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారని, దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే, తెలంగాణలో తగ్గుతున్నాయని అన్నారు. ఈ అంశంలో కేంద్రం కూడా ప్రశంసించిందని అన్నారు. తెలంగాణ చేస్తున్న కృషిని విదేశాల్లో ఉన్నవారు కూడా అభినందిస్తున్నారని తెలిపారు.
లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేయడం వల్లే కరోనా సామాజిక వ్యాప్తి చెందలేదని అభిప్రాయపడ్డారు. ర్యాపిడ్ టెస్టులు చేయాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ చెప్పారని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈటల వెల్లడించారు. ర్యాపిడ్ టెస్టులు చేయాలన్న ఐసీఎంఆర్ కూడా ఆపై విరమించుకుందని అన్నారు.
కరోనా టెస్టులు ఖరీదైనవి కావడంతో ప్రైవేటు ల్యాబ్ లను అనుమతించలేదని స్పష్టం చేశారు. తాము ఇంత నిబద్ధతతో పనిచేస్తున్నా, కొందరు అల్పబుద్ధితో వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కథనాలను ఆధారంగా చేసుకుని ఏదో బురదజల్లాలన్న ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.