Tamil Nadu: తమిళనాడులో 121 మంది చిన్నారులకు సోకిన మహమ్మారి!
- రాష్ట్రవ్యాప్తంగా 2,058 నిర్ధారిత కేసులు
- ఒక్క చెన్నైలోనే 673 కేసుల నమోదు
- కృష్ణగిరి జిల్లాలో మాత్రం కనిపించని వైరస్ ప్రభావం
కరోనా కేసులు పెరుగుతున్న తమిళనాడులో ఆందోళన కలిగించే మరో వార్త బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,058 మంది కరోనా బారినపడగా, వారిలో 12 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు 121 మంది వరకు ఉన్నారన్నదే ఆ వార్త. నిజానికి చిన్నారులపై వైరస్ ప్రభావం అంతగా ఉండదన్న వార్తలు ఇటీవల వినిపించాయి.
అయితే, ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఏకంగా 121 మంది చిన్నారులకు వైరస్ సంక్రమించడం ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 1,392 మంది పురుషులు కాగా, 666 మంది మహిళలు ఉన్నారు. గత 24 గంటల్లో చెన్నైలో 103 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 673కి పెరిగింది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 1,128 మంది కోలుకున్నారు. 25 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఒక్క కృష్ణగిరి జిల్లాలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ కరోనా ప్రభావం ఉన్నట్టు అధికారులు తెలిపారు.