Japan: ఇది ఇలాగే కొనసాగితే ఒలింపిక్స్ రద్దు: అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం
- కంటికి కనబడని శత్రువుతో పోరాడుతున్నాం
- పరిస్థితులు అదుపులోకి వస్తేనే క్రీడలు
- వ్యాక్సిన్ కనుగొనకుంటే పరిస్థితులు మరింత దిగజారుతాయన్న జపాన్
కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జులైలో టోక్యోలో ప్రారంభం కావాల్సిన ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాది జూలైకి వాయిదా వేస్తున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ఇప్పటికే ప్రకటించింది. అయితే, వచ్చే ఏడాది కూడా వైరస్ నియంత్రణలోకి రాకపోతే ఈ దఫా ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తామంటూ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని టోక్యో గేమ్స్ 2020 అధ్యక్షుడు యోషిరో మోరీ తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కంటికి కనబడని శత్రువుతో యుద్ధం చేస్తున్నాయని పేర్కొన్న ఆయన, వచ్చే ఏడాది నాటికి వైరస్ పూర్తిగా అదుపులోకి వస్తేనే క్రీడలను నిర్వహిస్తామన్నారు. మరోవైపు, జపాన్ మెడికల్ అసోసియేషన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చే ఏడాది కల్లా ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనకపోతే పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని పేర్కొంది.