Cyber crime: మొబైల్ రీచార్జ్ విషయంలో సైబర్ నేరగాళ్ల వలలో పడి .. రూ. 64 వేలు పోగొట్టుకున్న వైనం !
- హైదరాబాద్లోని మాసబ్ ట్యాంకులో ఘటన
- నేరగాళ్లు పంపిన లింకులను పంపి మోసపోయిన వైనం
- లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసుల వద్దకు
తన భార్య మొబైల్కు రూ. 200తో రీచార్జ్ చేసుకున్న వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ. 64 వేలు వదిలించుకున్న ఘటన హైదరాబాద్లో జరిగింది. సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. మాసబ్ట్యాంకుకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్ సోమవారం తన భార్య మొబైల్ నంబరుకు గూగుల్ పే ద్వారా రూ. 200 రీచార్జ్ చేశాడు.
అయితే, మంగళవారం ఉదయానికి కూడా రీచార్జ్ కాకపోవడంతో విషయం తెలుసుకునేందుకు సదరు సంస్థ నంబరు కోసం గూగుల్లో సెర్చ్ చేసి, ఓ నంబరు పట్టుకుని దానికి ఫోన్ చేశాడు. అయితే, తాను చేసింది సైబర్ నేరగాళ్ల ఫోన్ నంబరుకన్న సంగతి అతనికి తెలియదు.
ఆ నంబరుకు ఫోన్ చేసిన బాధితుడు జరిగిన విషయం చెప్పాడు. అతడు చెప్పింది విన్న నేరగాళ్లు తాము రెండు లింకులు పంపిస్తామని, వాటిని తాము చెప్పిన నంబరుకు పంపిన వెంటనే ఫోన్ రీచార్జ్ అవుతుందని నమ్మబలికారు. నిజమేనని భావించిన బాధితుడు వారు చెప్పినట్టే చేశాడు. ఆ వెంటనే అతడి ఖాతా నుంచి రూ. 64 వేలు మాయమయ్యాయి.
అతడు పంపిన లింకులతో యూపీఐ లింకు కూడా వెళ్లిపోవడంతో దాని ద్వారా నాలుగు లావాదేవీలు చేసి రూ. 64 వేలు కొల్లగొట్టారు. తన ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు మాయం కావడంతో లబోదిబోమన్న బాధితుడు వెంటనే సైబర్ క్రైం పోలీసులను కలిసి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.