Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన బండి సంజయ్
- ఉదయం 9 గంటలకు బాధ్యతల స్వీకరణ
- సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన సంజయ్
- రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చి 10న నియామకం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలను స్వీకరించారు. ఈ ఉదయం 9 గంటలకు హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం... అధ్యక్షుడి కుర్చీలో కూర్చున్నారు. మరోవైపు, లాక్ డౌన్ ముగిసిన తర్వాతే బాధ్యతలను స్వీకరించాలని ఇంతకు ముందు సంజయ్ భావించారు. అయితే, రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పరమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన నేపథ్యంలో, ఈరోజు ఆయన బాధ్యతలను స్వీకరించారు.
అయితే, లాక్ డౌన్ ఉన్న కారణంగా... ఈ కార్యక్రమానికి కార్యకర్తలు ఎవరూ రావద్దని ముందుగానే సంజయ్ కోరారు. కొందరు కీలక నేతలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మార్చి 10న బండి సంజయ్ ను బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.
ఓ సామాన్య కుటుంబంలో జన్మించి, పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన సంజయ్... రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ కొత్త పుంతలు తొక్కుతుందని పార్టీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి సంజయ్ గెలుపొందారు. టీఆర్ఎస్ కీలక నేత వినోద్ ను ఆయన ఓడించారు.