Asian Development Bank: కరోనాపై పోరుకు భారత్కు రూ.11 వేల కోట్ల రుణం
- ఆమోదం తెలిపిన ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్
- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి
- ఈ మొత్తంతో వైరస్ కట్టడి, పేదలకు సాయం చేయనున్న ప్రభుత్వం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న భారత్కు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రూ.11వేల కోట్ల (1.5 బిలియన్ డాలర్లు) రుణం మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ కట్టడి, నివారణ చర్యలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన పేదలకు తక్షణ సహాయం అందించేందుకు ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించనుంది.
ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన ప్రభుత్వ అత్యవసర ప్రతిస్పందన కార్యక్రమాలను సక్రమంగా అమలు చేసేందుకు ఏడీబీ అందించిన ఆర్థిక సాయం ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల అదనపు కార్యదర్శి సమీర్ కుమార్ చెప్పారు. అలాగే, ఆర్థిక వృద్ధిని పెంచడానికి, పునరుద్ధరణకు సాధ్యమైన మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత ప్రభుత్వానికి ఏడీబీ తెలిపింది. ఇందులో భాగంగా క్రెడిట్ గ్యారంటీ పథకాల ద్వారా ఆర్థిక సదుపాయాన్ని సులభతరం చేయడం, తద్వారా ప్రభావిత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) చేయూత అందించనుంది.