Telangana: తెలంగాణలో తగ్గుతున్న మహమ్మారి ఉద్ధృతి.. నేడు ఏడు కేసులే!
- వారం రోజులుగా నెమ్మదించిన వైరస్ ప్రభావం
- నెల రోజుల చిన్నారి సహా 35 మంది డిశ్చార్జ్
- కొత్త కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నేడు కొత్తగా ఏడు నిర్ధారిత కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,016కి పెరిగింది. అలాగే, ఇప్పటి వరకు ఈ వైరస్ బారినపడి 25 మంది మరణించారు. నేడు 13 మంది చిన్నారుల సహా 35 మందిని డిశ్చార్జ్ చేసినట్టు వైద్యాధికారులు తెలిపారు. వీరిలో మహబూబ్‌నగర్‌కు చెందిన నెల రోజుల చిన్నారి కూడా ఉండడం గమనార్హం. తాజాగా కోలుకున్న వారితో కలిపి మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 409కి పెరిగింది.
గత వారంతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆదివారం 11 కేసులు మాత్రమే నమోదు కాగా, సోమవారం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. నిన్న ఆరు కేసులు నమోదు కాగా, నేడు ఏడు కేసులు మాత్రమే వెలుగు చూశాయి. వెలుగులోకి వస్తున్న కొత్త కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం.