Tamilnadu: జైలుకు తీసుకువెళుతుంటే, దగ్గుతూ, తుమ్ముతూ... మస్కాకొట్టి ఖైదీ పరారీ!
- తమిళనాడులో పట్టుబడిన పాత ఖైదీ
- రిమాండ్ నిమిత్తం తీసుకుని వెళుతుంటే నాటకం
- ఆసుపత్రికి తీసుకుని వెళితే, కన్నుగప్పి పారిపోయిన వైనం
తనలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని ఎస్కార్ట్ పోలీసులకు మస్కా కొట్టిన ఓ ఖైదీ, పరారైన ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, శ్రీవైకుంఠం ప్రాంతానికి చెందిన మయాండీ, పలు దోపిడీ కేసుల్లో నిందితుడు కాగా, అతని కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఈ క్రమంలో మయాండీ మంగళవారం పట్టుబడగా, న్యాయమూర్తి ఆదేశానుసారం, తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టైలోని కేంద్రకారాగారానికి తరలించే పనిలో నిమగ్నమయ్యారు.
వ్యాన్ లో ఎక్కించుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో అదే పనిగా దగ్గడం, తుమ్మడం చేసిన మయాండీ, తనకు కరోనా వచ్చిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ఆందోళన చెందిన ఎస్కార్ట్ పోలీసులు, రాత్రి ఏడు గంటల సమయంలో, పాళయం కోట్టై సమీపంలోని ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తీసుకుని వెళ్లారు.
కరోనా లక్షణాలు కనిపించడంతో, పోలీసులు మయాండీకి కాస్తంత దూరంగా ఉండగా, అదే అదనని భావించిన అతను, వారి కన్నుగప్పి పారిపోయాడు. ఆ వెంటనే చుట్టుపక్కల ఏర్పాటు చేసిన 25 చెక్ పోస్టులను గాలించినా దొరకలేదు. సమీపంలోని వేదనాకులం నదిలో అతను ఈదుకుంటూ పారిపోయినట్టు సమాచారం తెలుసుకుని, మర పడవలను రంగంలోకి దించినా, ఫలితం దక్కలేదు. దీంతో అతన్ని మోస్ట్ వాంటెడ్ గా పేర్కొంటూ వాట్స్ యాప్ గ్రూపుల్లో చిత్రాలను విడుదల చేశారు పోలీసులు. ఇక ముందు జాగ్రత్త చర్యగా, అతనితో ఉన్న నలుగురు పోలీసులకూ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు.