LV Subrahmanyam: మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు వెసులుబాటు కల్పించిన ఏపీ ప్రభుత్వం!
- ఆన్ లైన్ లో బాధ్యతలు స్వీకరించి, ఆ వెంటనే పదవీ విరమణ
- బాపట్ల మానవ వనరుల అభివృద్ధి శిక్షణా సంస్థ డైరెక్టర్ బాధ్యతలు
- ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో ఉండిపోయిన ఎల్వీ
ఏపీ మాజీ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉద్యోగ విరమణకు సంబంధించి వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. నేడు (ఏప్రిల్ 30) పదవీ విరమణ చేయాల్సిన ఆయన, ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన పదవీ విరమణ చేసేలోగా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి శిక్షణా సంస్థ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి, ఆపై రిటైర్ అయ్యేలా చూడాలని, తద్వారా రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఆయన కోల్పోకుండా చూడాలని ప్రభుత్వం భావించింది.
ఇదే సమయంలో లాక్ డౌన్ కారణంగా స్వయంగా బాధ్యతలు స్వీకరించలేని పరిస్థితుల్లో ఆయన ఉండగా, ఆన్ లైన్ మాధ్యమంగా హైదరాబాద్ నుంచి బాధ్యతలు స్వీకరించి, ఆపై పదవీ విరమణ చేసే అవకాశాన్ని కల్పిస్తూ, ఆదేశాలు జారీ చేసింది. గత సంవత్సరం నవంబర్ లో సీఎస్ పదవి నుంచి ఎల్వీని తప్పించిన ప్రభుత్వం, అప్పట్లోనే మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించింది. దీనిపై అసంతృప్తికి గురైన ఆయన, బాధ్యతలు స్వీకరించకుండా, తన ఉద్యోగానికి సుదీర్ఘ సెలవు పెట్టారు. సర్వీస్ కాలం తక్కువగా ఉన్నందునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి.