India: భారత్ లో బాగా తగ్గిన కరోనాయేతర మరణాలు... కారణాలు వెల్లడించిన వైద్యులు!
- కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్
- ఎమర్జెన్సీ కేసులు పెద్దగా రావడం లేదంటున్న డాక్టర్లు
- ఒత్తిడి, పొల్యూషన్ తగ్గడమే కారణమంటున్న నిపుణులు
ఇప్పుడు భారత్ లో ఎక్కడ చూసినా కొవిడ్-19 కలకలం తప్ప మరేమీ కనిపించడంలేదు. కరోనా తప్ప ఇతర ఎమర్జెన్సీ కేసులు ఆసుపత్రులకు రావడం బాగా తగ్గింది. కరోనాయేతర మరణాలు కూడా తగ్గిపోయాయి. హార్ట్ అటాక్, స్ట్రోక్, ఇతర అత్యవసర కేసులు భారత్ లో గణనీయ సంఖ్యలో పడిపోవడం గతంలో ఎన్నడూ లేదు. దీనిపై వైద్య నిపుణులు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.
కరోనా విపత్తుకు ముందు కొన్ని రంగాల్లో తీవ్ర ఒత్తిళ్లు నెలకొని ఉండేవని, తద్వారా ఉద్యోగులు హార్ట్ అటాక్ లు, స్ట్రోక్ లకు గురయ్యేవారని వివరించారు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండడంతో ఉల్లాసంగా ఉంటున్నారని, దానికి తోడు పనిభారం కూడా మునుపటిలా ఉండడంలేదని తెలిపారు. వాతావరణ కాలుష్యం కూడా బాగా తగ్గిపోయిందని, తద్వారా శ్వాససంబంధ వ్యాధుల ఎమర్జెన్సీ కేసులు ఎక్కువగా రావడంలేదని పేర్కొన్నారు.
ఈ అంశంలో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఆసక్తికరమైన డేటా వెల్లడించింది. మధుమేహం, హైపర్ టెన్షన్, హార్ట్ సమస్యలతో 2017 మార్చిలో 729 మంది చనిపోగా, 2018 మార్చిలో 833 చనిపోయినట్టు తెలిపింది. 2019 మార్చిలో 937 మంది మరణించగా, ఈ ఏడాది మార్చిలో 595 మంది మాత్రమే మరణించినట్టు వివరించింది. ఇదంతా లాక్ డౌన్ పరిస్థితుల ప్రభావవమేనని స్పష్టం చేసింది.
అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ నివేదిక కూడా ఈ వాదనను మరింత బలపరుస్తోంది. లాక్ డౌన్ కాలంలో కరోనా కాకుండా ఇతర కారణాలతో మరణిస్తున్న వారి ఖననాలు, దహన సంస్కారాలు కొద్ది సంఖ్యలోనే నమోదవుతున్నాయని తెలిపింది. గతేడాదితో పోల్చితే ఇది చాలా తక్కువని రాయిటర్స్ పేర్కొంది.
లాక్ డౌన్ నేపథ్యంలోనూ అనేక పెద్ద ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు అందుబాటులోనే ఉన్నాయని, అయినప్పటికీ అత్యవసర వైద్య సహాయం కోరుతూ వచ్చే కేసుల సంఖ్యలో 50 నుంచి 60 శాతం తగ్గుదల కనిపిస్తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. పెద్దగా పని ఒత్తిడి లేకపోవడం, ఫ్యాట్ కలిగించే బయట తిండి లేకపోవడం, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండడం వల్ల ప్రజల్లో ఆరోగ్య స్థాయి పెరిగినట్టు భావిస్తున్నామని వైద్య నిపుణులు తెలిపారు.