Narendra Modi: మోదీ నాయకత్వం భళా... ప్రజల్లో మరింత పెరుగుతున్న నమ్మకం.. వెల్లడించిన సర్వేలు!
- కరోనా కష్టకాలంలో దృఢంగా నిలిచిన మోదీ
- మహమ్మారిపై పోరులో కేంద్రకంగా నిలిచిన వైనం
- అత్యంత కష్టకాలంలోనూ ఇతర దేశాలకు సాయం
కరోనా మహమ్మారి విజృంభణతో రాజకీయ, ఆర్థికపరమైన సమస్యలు చుట్టుముట్టినా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణ మరింత పెరిగిందే తప్ప ఇసుమంతైనా తగ్గలేదని ఓ అధ్యయనం చెబుతోంది. అందుకు కారణం, కరోనా విపత్తుపై ఆయన స్పందించిన తీరే. ప్రధాని మోదీపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయత జనవరితో పోల్చితే ఏప్రిల్ నాటికి పెరిగిందని మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా సర్వే సంస్థ పేర్కొంది. జనవరి 7 నాటికి మోదీ నాయకత్వంపై 76 శాతం నమ్మకం వ్యక్తం కాగా, ఏప్రిల్ 21 నాటికి అది 83 శాతంగా ఉందని మార్నింగ్ కన్సల్ట్ వివరించింది.
ఐఏఎన్ఎస్-సీఓటర్ చేపట్టిన అధ్యయనంలోనూ ఇలాంటి సమాచారమే వెల్లడైంది. మార్చి 25న మోదీ నాయకత్వంపై ఉన్న విశ్వసనీయత 76.8 శాతం కాగా, ఏప్రిల్ 21 నాటికి అది 93.5 శాతానికి చేరింది. మార్చి నెలారంభం నాటికి దేశంలో కరోనా కొద్దిస్థాయిలోనే ఉంది. ఆ సమయంలో దేశంలో ఆర్థిక రంగం మందగమనంలో సాగుతోంది. ఢిల్లీ వీధులు మతకల్లోలాలతో అట్టుడికాయి.
అయితే కరోనా వ్యాప్తి తీవ్రం అయ్యేకొద్దీ ప్రధాని మోదీ ప్రాభవం మరింత హెచ్చింది. ప్రజల కోసం ఆయన దృఢంగా నిలిచిన తీరు ఆదరణను మరింత పెంచింది. వైరస్ మహమ్మారిపై పోరాటంలో ఆయన కేంద్రకంగా నిలిచారు. పైగా, అత్యంత కష్టకాలంలోనూ ప్రపంచ దేశాలకు సాయపడడం కూడా మోదీ ఛరిష్మాను ఇతోధికంగా పెంపు చేసింది.