Centre: రవాణా సాఫీగా జరిగేలా చూడండి... రాష్ట్రాలకు, కేంద్రపాలిత పాంత్రాలకు కేంద్రం లేఖ
- అంతర్రాష్ట్ర రవాణా కీలకమని భావిస్తోన్న కేంద్రం
- పాసులు అడగవద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టీకరణ
- తాజాగా మార్గదర్శకాలు జారీ
లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో నిత్యావసరాల కొరత ఉత్పన్నం కాకుండా ఉండాలంటే రవాణా ఎంతో కీలకమని భావించిన కేంద్రం ఆ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అంతర్రాష్ట్ర రవాణా సాఫీగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలపైనే ఉందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. లారీలు, ట్రక్కులు సరకు రవాణా చేసే సమయంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద పాసులు అడగవద్దని, తద్వారా స్వేచ్ఛాయుత రవాణాకు వీలు కల్పించాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్ లకు లేఖ రాసింది.
అన్ని రవాణా వాహనాలకు అనుమతి ఉందని, వాటిలో ఇద్దరు డ్రైవర్లు, ఓ హెల్పర్ ఉండాలని, చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని వివరించారు. సరకు అన్ లోడ్ చేసి వెళుతున్న లారీలు, ట్రక్కులను గానీ, లేదా డెలివరీ ఇచ్చేందుకు వెళుతున్న లారీలు, ట్రక్కులను గానీ, లేదా సరుకు లోడ్ చేసుకునేందుకు వెళుతున్న లారీలు, ట్రక్కులను గానీ అడ్డుకోరాదని స్పష్టం చేశారు.
దేశంలో సరుకు రవాణాకు అనుమతిస్తూ కేంద్రం ఏప్రిల్ 15నే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పాసులు చూపించాలని అడుగుతుండడంతో రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ అడ్డంకులు తొలగించేందుకే కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసినట్టు అర్థమవుతోంది.