YSR Penssion: మూడు గంటల్లోనే 38.53 లక్షల మందికి పెన్షన్లు అందజేసిన ఏపీ వలంటీర్లు!
- ఈ ఉదయం ప్రారంభమైన వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ
- ఇంటింటికీ వెళ్లి డబ్బు అందిస్తున్న వలంటీర్లు
- సాయంత్రానికి పంపిణీ పూర్తవుతుందన్న అధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉదయం నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ తిరిగి మే నెలకు సంబంధించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక సొమ్ము పంపిణీని ప్రారంభించారు. కరోనా నియంత్రణలో భాగంగా పెన్షన్ దారుల బయో మెట్రిక్ స్థానంలో ఫొటోల జియో ట్యాగింగ్ విధానంలో పెన్షన్లు అందిస్తున్నారు.
ఈ ఉదయం 5 గంటలకే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి, వృద్ధులకు పెన్షన్ అందిస్తుండగా, మూడు గంటల వ్యవధిలోనే 38.53 లక్షల మందికి పెన్షన్లు అందాయని అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో 58.22 లక్షల మంది పెన్షనర్లు ఉండగా, వారికి ఇచ్చేందుకు రూ. 1,421.20 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఇంటింటికీ వెళుతున్న వలంటీర్లు, వృద్ధుల ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకుంటూ, కరోనా బారిన పడకుండా ఉండటానికి వారికి సలహాలు, సూచనలు చెప్పి, పెన్షన్లు అందిస్తున్నారని, సాయంత్రానికి పెన్షన్ల పంపిణీ పూర్తవుతుందని అధికారులు వ్యాఖ్యానించారు.