Plasma Therapy: ప్లాస్మా థెరపీ చేసినప్పటికీ మరణించిన కరోనా పేషెంట్!
- ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స
- చివరి ప్రయత్నంగా ప్లాస్మా థెరపీ చేసిన వైద్యులు
- 200 మి.లీ. డోసును ఎక్కించిన వైనం
ప్రస్తుతం ప్లాస్మా థెరపీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ థెరపీ ద్వారా కరోనాకు చికిత్స చేయవచ్చని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ మృత్యువాత పడ్డ ఘటన ముంబైలో జరిగింది. లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స పొందిన తొలి మహారాష్ట్ర వ్యక్తి ఈయనే కావడం గమనార్హం. గత నెల 29న ఆయన చనిపోయారు.
ఆసుపత్రి సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం, 53 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమించిన పరిస్థితులో హాస్పిటల్ లో చేరారు. చాలా రోజుల పాటు ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. చివరి నాలుగు రోజులు ప్లాస్మా థెరపీ చేశారు. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ నుంచి సేకరించిన ప్లాస్మాను (200 మి.లీ. డోసు) ఆయనకు ఎక్కించారు. ఇతర చికిత్సలేవీ ఫలితం ఇవ్వకపోవడంతో... చివరి ప్రయత్నంగా ప్లాస్మా థెరపీ చేశామని, అయినా ఫలితం దక్కలేదని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు.