Telugu Students: ఫిలిప్పీన్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగు విద్యార్థుల మృతదేహాలు స్వస్థలాలకు రాక
- ఏప్రిల్ మొదటి వారంలో ఫిలిప్పీన్స్ లో రోడ్డు ప్రమాదం
- అనంతపురం జిల్లాకు చెందిన వంశీ, రేవంత్ కుమార్ దుర్మరణం
- నిత్యావసరాల కోసం వెళుతుండగా అదుపుతప్పిన బైక్
ఏప్రిల్ మొదటి వారంలో ఫిలిప్పీన్స్ లో ఇద్దరు తెలుగు విద్యార్థులు బైక్ పై వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వారిని అనంతపురానికి చెందిన పెద్దింటి వంశీ, కదిరికి చెందిన కటికెల రేవంత్ కుమార్ గా గుర్తించారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితులు నెలకొని ఉండడంతో ఇన్నాళ్లు వారి మృతదేహాల తరలింపు సాధ్యపడలేదు.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. అటు కేంద్ర విదేశాంగ శాఖ తన ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ఫిలిప్పీన్స్ నుంచి ఎట్టకేలకు మృతదేహాలు అనంతపురం జిల్లా చేరుకున్నాయి. విగతజీవుల్లా వచ్చిన తమ బిడ్డలను చూసుకుని మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
కాగా, వంశీ, రేవంత్ కుమార్ ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ విద్య అభ్యసిస్తున్నారు. ఒకే గదిలో ఉంటున్న వీరు లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసరాలు తెచ్చుకునేందుకు బైక్ పై వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎదురుగా వస్తున్న వాహనాల లైట్లు కళ్లలో పడడంతో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వారు అక్కడిక్కడే మృతి చెందారు.