Budda Venkanna: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న కౌంటర్!
- మళ్లీ కొత్తగా విచారణ చేపడితే బయట స్వైర విహారం చేద్దామనుకుంటున్నావా?
- శవ రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్
- ఏడాదిగా కమిటీలు, విచారణ అంటూ ఏం చేశారు?
'చందాలూ, దందాలూ అంటూ చంద్రబాబు నాపై ఆరోపణలు చేశారు. మీ ఆస్తులు, నా ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ లేఖలు రాద్దాం, పిటిషన్లు వేద్దాం. కచ్చితంగా విచారణ జరిగేలా చూద్దాం. రెడీనా?' అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకి ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు.
ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందిస్తూ సెటైర్లు వేశారు. 'ఏంటి విజయసాయి రెడ్డీ సీబీఐ విచారణ అంటున్నావ్?' అని ప్రశ్నించిన ఆయన... 16 నెలలు ఊచలు లెక్కపెట్టారని... ప్రతి శుక్రవారం కోర్టు ముందు నిలబడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్, విజయసాయిరెడ్డి అక్రమాస్తులు రూ. 43 వేల కోట్లు అని సీబీఐ ప్రకటించింది కదా అని అన్నారు.
'మళ్ళీ కొత్తగా విచారణ మొదలుపెడితే ఇంకొన్ని రోజులు బయట స్వైరవిహారం చెయ్యాలని ఆశపడుతున్నావా? మీ మహామేత ఆత్మగా మారక ముందే అనేక విచారణలు, కమిటీలు వేశాడు. చంద్రబాబు గారిపై బురద చల్లడం సాధ్యంకాక చివరకు చేతులెత్తేసాడు. ఇక ఏడాదిగా కమిటీలు, విచారణలు అంటూ మీరు ఏమి పీకారో ప్రజలకు ఎరుకే.
శవ రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని మర్చిపోతే ఎలా విజయసాయిరెడ్డీ. తండ్రి శవం పెట్టుబడిగా సంతకాలు, ప్రజల మరణాలు పెట్టుబడిగా ఓదార్పు యాత్ర, బాబాయ్ బాత్ రూమ్ హత్య పెట్టుబడిగా ఎన్నికల ప్రచారం. అసలు శవం కనపడితే వదలకుండా నాన్న అకౌంట్ లో వేసి పబ్లిసిటీని పీక్స్ కి తీసుకెళ్లారు. కరోనాతో సహజీవనం చెయ్యండి... పోయేవాడు పోతాడు, ఓదార్పు-2కి పనికొస్తుంది అనే దుర్మార్గపు ఆలోచనలు మంచిది కాదు సాయిరెడ్డి' అని వెంకన్న ట్వీట్ చేశారు.