Rishab Pant: ధోనీ సలహాలు ఇచ్చే విధానం ఎలా ఉంటుందో వెల్లడించిన పంత్
- ధోనీ వారసుడిగా గుర్తింపుపొందిన పంత్
- ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో ధోని గురించి వెల్లడి
- ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకోవాలని భావిస్తాడని వివరణ
భారత క్రికెట్ లో ఎంతో ప్రతిభావంతుడిగా పేరుగాంచిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన సీనియర్ మహేంద్ర సింగ్ ధోనీపై స్పందించాడు. ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడుతూ, ధోనీని తన మార్గదర్శిగా పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లకు ధోనీ సలహాలు ఇచ్చే విధానం చాలా విభిన్నంగా ఉంటుందని తెలిపాడు. ఏ సమస్యకు కూడా పూర్తి పరిష్కారం చెప్పడని, సమస్యకు సంబంధించి కొన్ని సూచనలు మాత్రమే చేస్తాడని వివరించాడు. ఎవరి సమస్యకు వారే పరిష్కారం వెతుక్కోవాలన్నది ధోనీ విధానం అని, తన విషయంలోనూ ధోనీ అలాగే వ్యవహరిస్తుంటాడని పంత్ వెల్లడించాడు.
"మైదానంలోనూ, వెలుపలా ధోనీని ఓ దిశానిర్దేశకుడిగా భావిస్తుంటాను. ఏ సమస్యపై అయినా ధోనీతో కలివిడిగా మాట్లాడగల చనువు ఉంది. అయితే ఎప్పుడూ పూర్తి పరిష్కారం ఏంటో చెప్పేవాడు కాదు. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చేవాడంతే. వాటి సాయంతో నేను ఆ సమస్యను పరిష్కరించుకునేవాడ్ని. తద్వారా తనపై అతిగా ఆధారపడకుండా, యువ ఆటగాళ్లు స్వీయ సామర్థ్యంతో ఎదిగేలా చూసేవాడు" అని పంత్ వివరించాడు.