Chandrababu: కరోనా యోధురాలు డాక్టర్ విజయశ్రీకి ఘనస్వాగతం పలికారంటూ వీడియో పోస్టు చేసిన చంద్రబాబు
- గాంధీ ఆసుపత్రి వైద్యురాలికి ఆత్మీయ స్వాగతం
- రెండు వారాల పాటు విధులు నిర్వర్తించిన డాక్టర్ విజయశ్రీ
- అపార్ట్ మెంట్ వాసులను కూడా అభినందించిన చంద్రబాబు
అత్యంత ప్రమాదకర వైరస్ కరోనాపై ముందుండి పోరాడుతున్నవారిలో వైద్యులు, వైద్య సిబ్బంది గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఇప్పటికే అనేకమంది వైద్యులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అయినా గానీ డాక్టర్లు ఎక్కడా వెనక్కి తగ్గకుండా రోగులకు సేవలు అందిస్తూ తమ విద్యుక్త ధర్మాన్ని ఘనంగా చాటుతున్నారు.
ఈ నేపథ్యంలో, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యురాలు విజయశ్రీ రెండు వారాల పాటు ఏకబిగిన విధులు నిర్వర్తించి తన నివాసానికి వచ్చిన సందర్భంలో ఆమెకు అపార్ట్ మెంట్ వాసులు ఘన స్వాగతం పలికారు. కరోనా ముప్పు దృష్ట్యా తమ ఫ్లాట్ల బాల్కనీల్లోనే నిల్చుని డాక్టర్ విజయశ్రీకి నీరాజనాలు అర్పించారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు.
"రెండు వారాల పాటు గాంధీ ఆసుపత్రిలోని కొవిడ్ బ్లాక్ లో రోగులకు వైద్యసేవలు అందించి వచ్చిన గాంధీ ఆసుపత్రి వైద్యురాలు విజయశ్రీకి ఎలాంటి ఘనస్వాగతం లభించిందో ఈ వీడియో చెబుతోంది. ఇక్కడ నేను ఇద్దరు హీరోలను చూస్తున్నాను. ఒకరు డాక్టర్ విజయశ్రీ, రెండవది ఆమెను అభినందిస్తున్న వందలమంది అపార్ట్ మెంట్ వాసులు. ఆమె పట్ల అపార గౌరవంతో హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు" అని వివరించారు.