IFSC: ఆర్థిక రాజధాని అనే మాటకు ఇక అర్థం ఏమిటి?: కేంద్రంపై మండిపడ్డ శివసేన
- ఐఎఫ్ఎస్సీ హెడ్ క్వార్టర్ ను గుజరాత్ లో ఏర్పాటు చేయనున్న కేంద్రం
- 'సబ్ కా సాథ్... సబ్ కా వికాస్' అంటే ఇది కాదని
- మహారాష్ట్రకు ఇంకేం మిగిలిందన్న శివసేన
'ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)' హెడ్ క్వార్టర్ ను గుజరాత్ లోని గాంధీనగర్ లో ఏర్పాటు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. 'సబ్ కా సాథ్... సబ్ కా వికాస్' అంటే ఇది కాదని విమర్శించింది.
శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ మీడియాతో మాట్లాడుతూ, దేశానికి ఆర్థిక రాజధాని ముంబై అని చెప్పారు. ఐఎఫ్ఎస్సీని ముంబై నుంచి గుజరాత్ కు తరలించారని చెప్పారు. మహారాష్ట్ర దినోత్సవంనాడు ఇది జరిగిందని... ఈ నిర్ణయంతో యావత్ రాష్ట్రం బాధపడిందని అన్నారు.
గుజరాత్ లో ఫైనాన్షియల్ సెంటర్ పెట్టడానికి తాము వ్యతిరేకం కాదని... కానీ, మహారాష్ట్రకు ఇంకేం మిగిలిందనే విషయంపైనే తాము ఆందోళన చెందుతున్నామని సావంత్ చెప్పారు. ఆర్థిక రాజధాని అనే మాటకు అర్థం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు.