Justice AK Tripathi: కరోనాతో లోక్ పాల్ సభ్యుడు జస్టిస్ ఏకే త్రిపాఠి కన్నుమూత
- ఏప్రిల్ 2న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన త్రిపాఠి
- పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ అమర్చిన వైద్యులు
- కరోనా నుంచి కోలుకున్న త్రిపాఠి కుమార్తె, వంట మనిషి
దేశంలో కరోనాతో ఓ ప్రముఖుడు మృతి చెందారు. లోక్ పాల్ సభ్యుడు జస్టిస్ ఏకే త్రిపాఠి (రిటైర్డ్) కరోనా వైరస్ కు బలయ్యారు. త్రిపాఠి వయసు 62 సంవత్సరాలు. ఏప్రిల్ 2న కరోనా లక్షణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. కాగా, త్రిపాఠి కుమార్తె, వంట మనిషికి కూడా కరోనా సోకగా, వారు కోలుకున్నారు.
కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కు తరలించారు. తొలుత ఐసీయూలో చికిత్స అందించిన వైద్యులు ఆపై పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ అమర్చారు. జస్టిస్ త్రిపాఠి గతంలో చత్తీస్ గఢ్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు. అవినీతి నిరోధక అంబుడ్స్ మన్ వ్యవస్థగా పేరుగాంచిన లోక్ పాల్ లో నలుగురు జ్యుడిషియల్ సభ్యుల్లో త్రిపాఠి కూడా ఒకరు.