Mohammad Shami: ఇంటి పైనుంచి దూకేస్తానేమోనని అనుక్షణం గమనిస్తుండేవారు: షమీ
- తన కెరీర్ లో దుర్దశ గురించి చెప్పిన షమీ
- 2015 వరల్డ్ కప్ తర్వాత గాయపడినట్టు వెల్లడి
- వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య ఆలోచన చేశానని వివరణ
టీమిండియాలో అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ గా మన్ననలు అందుకుంటున్న మహ్మద్ షమీ తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజుల గురించి వెల్లడించాడు. రోహిత్ శర్మతో ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడిన షమీ, 2015 వరల్డ్ కప్ తర్వాత తన కెరీర్ ఒడిదుడుకులమయం అయిందని, మళ్లీ ఈస్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపాడు. గాయాలపాలైన తాను కోలుకోవడానికి ఒకటిన్నర సంవత్సరం పట్టిందని చెప్పాడు. ఆ సమయంలో కొన్ని వ్యక్తిగత సమస్యలతో తీవ్ర మానసిక వేదనకు లోనయ్యానని, మూడు సార్లు ఆత్మహత్యకు పాల్పడాలన్న ఆలోచన వచ్చినా కుటుంబ సభ్యుల అండతో ఆ కష్టకాలం నుంచి గట్టెక్కగలిగానని వివరించాడు.
కోల్ కతాలో తన నివాసం ఓ భారీ అపార్ట్ మెంట్ లో 24వ అంతస్తులో ఉండేదని, నిత్యం బాధపడుతూ ఉండే తాను ఎక్కడ కిందికి దూకేస్తానో అని కుటుంబ సభ్యులు అనుక్షణం గమనిస్తుండేవారని షమీ వెల్లడించాడు. "కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు నా వెన్నంటే ఉండేవారు. వారు ఆ విధంగా మద్దతు ఇవ్వకపోయుంటే నేను ఏదో ఒక తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండేవాడ్ని" అంటూ భావోద్వేగాలకు లోనయ్యాడు.